
D News: టాలీవుడ్‌లో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌లో నటించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కించిన అనిల్ రావిపూడి.. మరోసారి మెగాస్టార్‌తో కలిసి పనిచేయబోతున్నారనే వార్తల మధ్య, ఇప్పుడు నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కార్యరూపం దాల్చితే తెలుగు సినిమా చరిత్రలోనే మరో భారీ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం ఇదంతా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు, రూమర్స్ మాత్రమే. చిరంజీవి, నాగార్జున, అనిల్ రావిపూడి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం ఇద్దరు సీనియర్ హీరోల అభిమానులకు ఇది పండగలాంటి వార్తే అవుతుంది.
ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున ఇద్దరూ దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న నేపథ్యంలో.. వీరిద్దరినీ ఒకే సినిమాలో సమాన స్థాయిలో చూపించడం అనిల్ రావిపూడికి పెద్ద సవాలుగా మారనుంది. అదే సమయంలో కాంబినేషన్ వర్కౌట్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు సృష్టించే అవకాశం ఉంది.
