D News: 22ఏ సమస్య ఎందుకు తలెత్తిందని సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో నిషేధిత భూముల జాబితా, పట్టాల పంపిణీపై కూడా చర్చించినట్లు సమాచారం.

22ఏ సమస్యపై అధికారులను ఆరా తీసిన సీఎం

22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో ఇలాంటి సమస్య ఎందుకు కనిపించలేదని, 22ఏ సమస్య ఎందుకు తలెత్తిందని, వివాదంగా మారడానికి అసలు కారణాలు ఏంటని ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. దీనిపై రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేశ్‌కుమార్‌ సీఎంకు వివరాలు వెల్లడించినట్లు సమాచారం. 22ఏకు సంబంధించిన సమస్యలు గతంలోనూ ఉన్నాయని, హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత భూముల జాబితాను అప్‌డేట్‌ చేసినట్లు వివరించినట్లు తెలిసింది.

హైకోర్టు ఆదేశాలతో జాబితాల అప్‌డేట్‌

నిషేధిత భూముల జాబితాను అప్‌డేట్‌ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో గతేడాది చివర్లో జిల్లా కలెక్టర్లు సంతకం చేసిన ప్రతులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు అధికారులు సీఎంకు వివరించినట్లు సమాచారం. ఎక్కడెక్కడ సమస్యలు ఏర్పడ్డాయి, ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారనే వివరాలను కూడా అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లోనే 22ఏ అంశానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

980 దరఖాస్తులు.. సమస్యల పరిష్కారానికి కమిటీ

22ఏ జాబితాలో తమ భూములు ఉన్నాయంటూ బాధితుల నుంచి సుమారు 980 దరఖాస్తులు అందినట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్లను సబ్‌ రిజిస్ట్రార్లు తిరస్కరించిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సెక్రటరీలతో ప్రభుత్వం హై లెవల్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు వివరించినట్లు తెలిసింది.

అసెంబ్లీలో 22ఏపై ప్రభుత్వ వివరణ

నిషేధిత భూముల జాబితా అంశం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత జాబితా, కొత్తగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన జాబితాలోని వివరాలను అసెంబ్లీలో వెల్లడించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా 22ఏకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించినట్లు తెలిసింది. విపక్ష సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే సంబంధిత వివరాలు, గణాంకాలతో సమాధానం ఇచ్చేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

పట్టాల పంపిణీపైనా సమీక్ష

సుదీర్ఘకాలంగా భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కులు లేని రైతులకు పట్టాల పంపిణీ అంశంపైనా సమీక్షలో చర్చించినట్లు సమాచారం. ఇటీవల సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లో 1,061 మంది రైతులకు 1,044 ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురంలో 780 మంది రైతులకు 1,378 ఎకరాల భూమికి పట్టాలు అందజేసినట్లు అధికారులు వివరించినట్లు సమాచారం. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో చేపట్టాల్సిన పట్టాల పంపిణీపైనా సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లోనూ ఏళ్లుగా భూమి హక్కులు పొందని రైతుల వివరాలను సిద్ధం చేసి సర్వే నిర్వహించాలని రెవెన్యూ శాఖను మంత్రి పొంగులేటి ఆదేశించినట్లు సమాచారం.