
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులకు బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 22ఏ భూదందా ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. 22ఏ సర్వే నంబర్లను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారని విమర్శించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సక్రమంగా అమలు కావడం లేదని దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
22ఏ భూముల వ్యవహారంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. న్యాయమైన భూములను 22ఏ జాబితాలో చేర్చకుండా వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని కోరారు. 22ఏ భూముల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్, పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ సహా పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అలాగే ధరణి, భూభారతి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
