
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ‘ధరణి’ పేరుతో బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించిన ఆయన ప్రస్తుతం ‘భూభారతి’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని విమర్శించారు.
భూములను దోచుకునేందుకే 22A నిబంధనను తీసుకొచ్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పట్టాలు పర్మిషన్లు ఉన్న భూములను సైతం 22A జాబితాలో చేర్చారని మండిపడ్డారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా భూములను విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం భూములు అమ్ముకోవడమేనని కిషన్ రెడ్డి విమర్శించారు. భూములు విక్రయించకుండా ప్రభుత్వం నడపలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. వక్ఫ్ భూములు మినహా రాష్ట్రంలోని అన్ని భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారని ఆరోపించారు.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణలో భూములు విక్రయించి ఆ నిధులను ఢిల్లీలోని కాంగ్రెస్‌కు అందించాలన్నదే ఆ పార్టీ విధానమని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను ‘RR రియల్ ఎస్టేట్ సంస్థ’గా మార్చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
