
D News: కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత ఆమె పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్.. త్వరలోనే బిగ్ అప్డేట్’’ అంటూ ఉన్న ఈ పోస్ట్ కొండా సురేఖ అధికారిక ఖాతా నుంచే వచ్చిందని పలువురు భావించారు.
వైరల్ పోస్ట్‌పై సురేఖ క్లారిటీ
పోస్ట్ వైరల్ కావడంతో కొండా సురేఖ స్వయంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికల్లో తన పేరుతో ప్రచారం అవుతున్న వార్తలు, పోస్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలను కోరారు.
బర్తరఫ్ తర్వాత రాజకీయ వేడి
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపించారు. అనంతరం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది.
పార్టీ మార్పుపై ప్రచారం
బర్తరఫ్ అనంతరం కొండా సురేఖ పార్టీ మారతారంటూ కూడా పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆమె ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పేరుతో వైరల్ అయిన ఫేక్ పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఫేక్ వార్తలకు అడ్డుకట్ట
వైరల్ పోస్టుతో కొండా అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. అయితే కొండా సురేఖ అధికారికంగా స్పందించి ఆ పోస్టుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడంతో ఫేక్ ప్రచారానికి తెరపడింది. ఇకపై తన అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్నే నమ్మాలని ఆమె సూచించారు.
