D News: Sept 3: LAYOFFS: 8 నెలల్లోనే 1.23 లక్షల మందికి పింక్ స్లిప్‌లు.. AI దెబ్బకు ఐటీ ఉద్యోగాల్లో కలవరం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటం, అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రముఖ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గడిచిన ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే AI సాంకేతికత ప్రభావం, కంపెనీల పునర్వ్యవస్థీకరణ వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,23,300 మందికి పైగా ఉద్యోగులు పింక్ స్లిప్‌లు అందుకున్నారు.

గతేడాది అంటే 2025లో మొత్తం 1,22,606 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఈ ఏడాది కేవలం ఎనిమిది నెలల్లోనే ఆ సంఖ్యను దాటిపోవడం ఐటీ రంగంలో నెలకొన్న పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మిగిలిన నాలుగు నెలల్లో కూడా కంపెనీలు మరింత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ ఉద్యోగ పాత్రలను AI ఆధారిత ఆటోమేషన్ వేగంగా భర్తీ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Layoffs.fyi గణాంకాల ప్రకారం.. ఒరాకిల్, ఇంటెల్, డెల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ ఐటీ దిగ్గజాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు చేపడుతున్నాయి. కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, కీలక పెట్టుబడులను AI ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికతల వైపు మళ్లిస్తున్నాయి. మానవ వనరులపై అయ్యే వ్యయాన్ని తగ్గించి, AI మౌలిక సదుపాయాలు, కొత్త టెక్నాలజీలపై తిరిగి పెట్టుబడులు పెట్టాలనే కార్పొరేట్ వ్యూహంలో భాగంగానే ఈ లేఆఫ్స్ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.

దీని ప్రభావం ముఖ్యంగా ఐటీ ప్రాజెక్టుల్లోని నాన్-కోర్ విభాగాలు, సాంప్రదాయ కోడింగ్, సపోర్ట్ రోల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఎక్కువగా పడుతోంది. AI ఆధారిత ఆటోమేషన్ విస్తరిస్తున్న కొద్దీ కొన్ని సంప్రదాయ ఉద్యోగ పాత్రల అవసరం తగ్గే అవకాశం ఉందనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. ఒకవైపు కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటూ AI వైపు భారీగా పెట్టుబడులు పెడుతుండగా.. మరోవైపు ఉద్యోగులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.