
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కలిసి ఈ చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు పీడ దినాలు పట్టి వెయ్యి రోజులు పూర్తయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర సంపాదన కోసం ముఖ్యమంత్రి, మంత్రులు తన్నుకుంటున్నారని ఆరోపించారు.
రైతుల సమస్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రైతులు ధాన్యం కుప్పలపై చనిపోతున్నారని, సాగునీరు అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ వెయ్యి రోజుల పాలనలో ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రైతు బీమా పథకాన్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. అన్నదాతల జేబులు కొట్టి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ జేబులు నింపుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని కూడా కేటీఆర్ తప్పుబట్టారు. కాళేశ్వరంపై ప్రభుత్వ కక్ష రైతులకు శిక్షగా మారిందని అన్నారు. ప్రాజెక్టుపై ప్రశ్నలు అడిగే ఇంజినీర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాగునీరు, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపైనా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగాలు అడిగితే లాఠీలతో కొడుతున్నారని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
విద్యా వ్యవస్థపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చదువురాని వ్యక్తి చేతుల్లో విద్యాశాఖ వెళ్లడంతో రాష్ట్ర విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ హయాంలో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతున్న కాలేజీలను బెదిరిస్తోందని ఆరోపించారు.
మరోవైపు, మూసీ ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్నప్పటికీ, మూసీ నది అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని కేటీఆర్ ఆరోపించారు.
