
D Educt: Sept 2: తల్లికి వందనం నిధులపై కీలక అప్డేట్
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం కింద పెండింగ్‌లో ఉన్న నిధుల జమ, అర్హుల జాబితాకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పథకానికి అర్హత ఉండి ఇప్పటివరకు ఆర్థిక సాయం అందని విద్యార్థులతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా త్వరలో నిధులు జమ కానున్నాయి.
గతంలో ఆగస్టు 30న లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం సెప్టెంబర్ 7 లేదా 8 తేదీల్లో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా అవకాశం
పాఠశాలలు, కళాశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉంది.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను నేరుగా జమ చేయనున్నారు.
ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం
తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థికి ఏడాదికి మొత్తం రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో పాఠశాలల నిర్వహణకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.2 వేలు మినహాయించి, మిగిలిన రూ.13 వేల మొత్తాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
ఈ వారం వరుస సెలవులు ఉండటంతో నిధుల విడుదల ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో పెండింగ్ నిధుల జమ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
