
D Educt: Sept 1: దళిత, ఆదివాసీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విద్యా సంస్థలను కొనసాగించాలని ఆయన కోరారు.
‘పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అంటూ ఆశ చూపించి, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాలు, స్థలాలను ఫిజిక్స్‌వాలా వంటి ప్రైవేటు కోచింగ్ సంస్థలకు కేటాయించకూడదు’ అని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల వనరులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను విరమించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో దళిత, గిరిజన విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణను ప్రభుత్వమే అందించాలని శ్రీనివాసరావు కోరారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ భవనాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే శిక్షణ కొనసాగించాలని సూచించారు.
మారికవలసతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్యాయం చేయొద్దంటూ ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇలాంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు.
