
D Educt: Sept 1: Inter Admissions: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండియర్ అడ్మిషన్లు తగ్గుముఖం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ అడ్మిషన్లు భారీగా తగ్గుతున్నాయి. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నది. ఏటా 10 వేల నుంచి 20 వేల మంది వరకు విద్యార్థులు తగ్గుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 2025-26 విద్యాసంవత్సరంలో అంతకుముందు ఏడాదితో పోల్చితే ఏకంగా 17 వేల మంది విద్యార్థులు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు విద్యార్థుల రిటెన్షన్ రేటు తగ్గుతుండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంటర్ విద్యాశాఖ ఫస్టియర్ అడ్మిషన్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నప్పటికీ, సెకండియర్ వరకు విద్యార్థులను కొనసాగించడం, మధ్యలో చదువు మానేసిన వారిని తిరిగి విద్యలోకి తీసుకురావడంపై తగినంత దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఫస్టియర్, సెకండియర్ కలిపి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల మొత్తం సంఖ్య ఇటీవల పెరుగుతున్నది. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య 1.80 లక్షలుగా ఉండగా, 2023-24లో 1.63 లక్షలకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరిగింది. 2024-25లో 1.68 లక్షలకు, 2025-26లో 1.72 లక్షలకు చేరింది. అయితే ఈ పెరుగుదల ప్రధానంగా ఫస్టియర్ అడ్మిషన్లకే పరిమితమైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులను సెకండియర్ వరకు కొనసాగించడంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎందుకు విఫలమవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయడానికి కారణాలేమిటి? వారు ప్రైవేట్ కాలేజీలకు తరలిపోతున్నారా? లేక ఫెయిలైన విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులకు దూరమవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించి, విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయడానికి గల కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెకండియర్‌లో విద్యార్థుల రిటెన్షన్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు డ్రాపౌట్ అయిన విద్యార్థులను తిరిగి విద్యలోకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.
గణాంకాలు ఇలా..
2021-22 విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌లో 1.10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే 2022-23లో వీరిలో సెకండియర్‌కు చేరిన వారి సంఖ్య 89,993కు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 20,137 మంది విద్యార్థులు తగ్గిపోయారు.
2022-23లో ఫస్టియర్‌లో 90,393 మంది విద్యార్థులు చేరారు. వీరంతా 2023-24లో సెకండియర్‌కు ప్రమోట్ కావాల్సి ఉండగా, ఆ ఏడాది సెకండియర్‌లో విద్యార్థుల సంఖ్య 78,412కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఏడాది కాలంలో 11,981 మంది విద్యార్థులు తగ్గిపోయారు.
2023-24 విద్యాసంవత్సరం నుంచి 2024-25 వరకు ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థుల సంఖ్య 84,967గా నమోదైంది. అయితే ఆ తర్వాతి ఏడాది మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
2024-25 విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌లో 83,845 మంది విద్యార్థులు చేరగా, ఇదే బ్యాచ్ సెకండియర్‌కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య 67,105కు పడిపోయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 16,740 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
