
D Educt: Sept 1: Chhattisgarh HC on POCSO Case: స్కూల్ రికార్డుల్లోని పుట్టిన తేదీతోనే వయసు నిర్ధారణ కాదు
పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన ప్రాథమిక ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలు లేకుండా కేవలం పాఠశాల రికార్డుల్లో నమోదైన పుట్టిన తేదీ ఆధారంగా బాధితురాలి వయసును ఖరారు చేయలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేస్తూ, అతడిని నిర్దోషిగా ప్రకటించి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
కేసు నేపథ్యం.. ప్రాసిక్యూషన్ ఆరోపణలు
ఓ వ్యక్తి మైనర్ బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు నిందితుడిని ఐపీసీ సెక్షన్లు 363, 366తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్-6 కింద దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఘటన జరిగిన సమయంలో బాధితురాలి వయసు 18 ఏళ్ల కంటే తక్కువగా ఉందా లేదా అనే అంశాన్ని హైకోర్టు ప్రధానంగా పరిశీలించింది.
స్కూల్ రికార్డులపైనే ఆధారం.. టీచర్ వాంగ్మూలంతో కీలక అంశాలు
బాధితురాలి వయసును నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ ఆమె 8వ తరగతి మార్క్‌షీట్, పాఠశాల ప్రవేశ రికార్డులను సాక్ష్యాలుగా సమర్పించింది. అయితే విచారణ సమయంలో ఈ రికార్డుల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాఠశాల సహాయ ఉపాధ్యాయుడు కీలక విషయాలను వెల్లడించారు. బాధితురాలి పుట్టిన తేదీని తాను స్వయంగా నమోదు చేయలేదని, ఏ ఆధారాలు లేదా పత్రాల ఆధారంగా ఆ తేదీని పాఠశాల రికార్డుల్లో నమోదు చేశారో తనకు తెలియదని కోర్టుకు తెలిపారు.
అదే సమయంలో బాధితురాలి తల్లిదండ్రులకు కూడా ఆమె ఖచ్చితమైన పుట్టిన తేదీ తెలియదని కోర్టు గుర్తించింది. ఆమె వయసు సుమారు 14 ఏళ్లు ఉంటుందని మాత్రమే తల్లిదండ్రులు చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, పాఠశాల రికార్డుల్లో నమోదైన పుట్టిన తేదీకి మద్దతుగా బదిలీ ధ్రువపత్రం (Transfer Certificate) లేదా అధికారిక జనన ధ్రువీకరణ పత్రాన్ని (Birth Certificate) ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయింది.
సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించిన హైకోర్టు
ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన పలు గత తీర్పులను కూడా ప్రస్తావించింది. ఒక పత్రాన్ని కోర్టు సాక్ష్యంగా స్వీకరించినంత మాత్రాన అందులో నమోదు చేసిన ప్రతి అంశం నిబంధనల ప్రకారం నిర్ధారించబడిన వాస్తవంగా పరిగణించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బాధితురాలు ఘటన జరిగిన సమయంలో మైనర్ అని నిరూపించేందుకు అవసరమైన విశ్వసనీయ ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించడంలో విఫలమైందని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం పాఠశాల రికార్డుల్లోని పుట్టిన తేదీ ఆధారంగా ఆమె వయసును నిర్ధారించలేమని పేర్కొంటూ, ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.
