
D Educt: Sept 1: రాష్ట్రంలో ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇజ్రాయెల్లో ఉపాధి పొందేలా యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 14 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభం కానుంది.
తొలి విడతలో భాగంగా అభ్యర్థులకు 100 రోజుల పాటు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. ఇజ్రాయెల్లో డిమాండ్ ఉన్న హోమ్ బేస్డ్ కేర్గివింగ్ విభాగంలో ఉపాధి పొందేందుకు ఏఎన్ఎం, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన మహిళలు మాత్రమే అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రం నలుమూలల నుంచి అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యేలా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరాలను హోమ్ బేస్డ్ కేర్గివింగ్ శిక్షణా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
ఇతర వృత్తులకు సంబంధించిన నైపుణ్య శిక్షణ కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురం నగరాలను ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో ఎస్సీ మహిళలతో పాటు పురుషులకు కూడా వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ అందించనున్నారు.
