
D Educt: Aug 25: పీజీ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ (పీజీఈసెట్) రెండో విడతలో ఎంటెక్ సీట్ల సంఖ్య పెరగనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సంబంధిత కళాశాలలను తనిఖీ చేయాలని సాంకేతిక విద్యాశాఖ వర్సిటీలను ఆదేశించింది.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఒక్కో బ్రాంచీకి 30 సీట్ల చొప్పున మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 18 సీట్లకే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఎంటెక్ సీట్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తొలి విడత పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద మొత్తం 5,338 ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కేవలం 2,317 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే మొత్తం సీట్లలో సుమారు 43 శాతం మాత్రమే నిండాయి. దీంతో గణనీయమైన సంఖ్యలో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
ఇప్పటికే ఉన్న సీట్లే పూర్తిస్థాయిలో భర్తీ కాకపోవడంతో ఎంటెక్‌లో తరగతులు సక్రమంగా నిర్వహించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయాలంటే ఎంటెక్ అర్హత తప్పనిసరి కావడంతో, ఈ కోర్సులకు ప్రాధాన్యత కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఎంటెక్ సీట్లను కుదించి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల పెంపునకు అవకాశం కల్పించింది. అయితే విద్యార్థుల హాజరు లేకపోవడమే తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడానికి ప్రధాన కారణమైతే, ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్)ను కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన ఎందుకు విధించడం లేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
