ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు మొత్తం 52 మంది రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు అందించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఎన్నికలకు ముందు భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాకెట్లు అందుకున్న వారిలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. వీరిలో 11 మంది రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.

బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లను రెండు దశల్లో అందించినట్లు వార్తలు వస్తున్నాయి. తొలి దశలో 8 మంది నేతలకు, రెండో దశలో మరో 44 మందికి జాకెట్లు అందించినట్లు తెలుస్తోంది. ఒక్కో జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం.

2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అగ్రనేతలు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలలో విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారి భద్రతపై యూపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అయితే 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు అందించడానికి నిర్దిష్ట దాడి ముప్పు లేదా ప్రత్యేక నిఘా సమాచారం కారణమా అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.

By Rajini