ఆర్థిక అవకతవకలు సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా వెంటనే పదవికి రాజీనామా చేయాలని బీసీఐ కో-చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన ఈ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని మిశ్రాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

శనివారం బీసీఐ చైర్మన్‌కు రాసిన లేఖలో మిశ్రాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎనిమిది అంశాలను సదాశివ రెడ్డి ప్రస్తావించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధమైన సంస్థ అని గుర్తుచేస్తూ మిశ్రా దానిని వ్యక్తిగత ఆస్తిగా భావించారని ఆరోపించారు. సంస్థను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.

2020 సెప్టెంబర్‌లో మిశ్రా ఎంపిక చేసిన ట్రస్టీలతో ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్’ పేరుతో కొత్త ట్రస్ట్‌ను రిజిస్టర్ చేయించారని సదాశివ రెడ్డి ఆరోపించారు. అనంతరం బీసీఐ నిధులను పెద్ద మొత్తంలో ఆ ట్రస్ట్‌కు బదిలీ చేసేందుకు తీర్మానం చేశారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తాను, ఇతర సభ్యులు వ్యతిరేకించినప్పటికీ వారి అభ్యంతరాలను పట్టించుకోలేదని తెలిపారు.

బీసీఐ అనుమతులు, రెన్యువల్స్ కోసం న్యాయ కళాశాలలు భారీ మొత్తంలో నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సదాశివ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల బీసీఐతో పాటు న్యాయ విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీసీఐ కౌన్సిల్‌తో పాటు పలు న్యాయ విద్యాసంస్థల్లో మిశ్రా బంధువులు, సన్నిహితులకు ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు.

నియామకాల కోసం ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదని, నియామకాలకు సంబంధించిన పత్రాలు కూడా బీసీఐ కౌన్సిల్ ముందుకు రాలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు తనపై ఉంచిన నమ్మకాన్ని తాను నిర్లక్ష్యం చేస్తే అది వృథా అవుతుందని సదాశివ రెడ్డి అన్నారు. ఈ లేఖను తీవ్ర వేదనతో రాస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, పాలక నిబంధనలను ఉల్లంఘిస్తూ మనన్ కుమార్ మిశ్రా బీసీఐ చైర్మన్‌గా దశాబ్దానికి పైగా కొనసాగుతున్నారని ఆరోపిస్తూ ఆయన పదవిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సదాశివ రెడ్డి తాజాగా ఈ లేఖను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

By Rajini