
D Educt: Aug 21: ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు ఈసారి మరింత నాణ్యమైన, భద్రతతో కూడిన మార్కుల సర్టిఫికెట్లు అందనున్నాయి. చిరిగిపోని కాగితంతో ముద్రించిన ఈ సర్టిఫికెట్లు మందంగా ఉండటంతో పాటు సాధారణ కాగితాల మాదిరిగా సులభంగా చిరిగిపోవని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. తడిసినా సర్టిఫికెట్లకు పెద్దగా నష్టం కలగకుండా ప్రత్యేకమైన కాగితాన్ని ఉపయోగించినట్లు ఆమె వెల్లడించారు.
నకిలీ మార్కుల సర్టిఫికెట్ల తయారీకి అడ్డుకట్ట వేసేలా ఈసారి సర్టిఫికెట్లలో హై సెక్యూరిటీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టారు. దాదాపు 10 రకాల హై సెక్యూరిటీ ఫీచర్లతో పాటు మొత్తం 25 రకాల భద్రతా అంశాలను సర్టిఫికెట్లలో పొందుపరిచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. దీంతో సర్టిఫికెట్లను నకిలీగా తయారు చేయడం లేదా మార్పులు చేయడం మరింత కష్టతరం కానుంది.
ఈసారి మార్కుల సర్టిఫికెట్లలో విద్యార్థుల కలర్ ఫొటోలను కూడా ముద్రించారు. వీటితో పాటు బార్కోడ్, ఇతర భద్రతా అంశాలను జోడించారు. విద్యార్థుల వివరాల భద్రత, సర్టిఫికెట్ల ప్రామాణికతను నిర్ధారించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
మార్చి, మే నెలల్లో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లను ఇప్పటికే సంబంధిత జిల్లాల డీఐఈఓలు, నోడల్ ఆఫీసర్లకు పంపించారు. అక్కడి నుంచి ఆయా సర్టిఫికెట్లను సంబంధిత కళాశాలలకు పంపించనున్నారు.
విద్యార్థులు తమ మార్కుల సర్టిఫికెట్లను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. కొత్త భద్రతా ఫీచర్లతో కూడిన సర్టిఫికెట్ల వల్ల విద్యార్థుల విద్యా ధ్రువపత్రాలకు మరింత రక్షణ లభించడంతో పాటు భవిష్యత్లో వాటి ప్రామాణికతను సులభంగా నిర్ధారించే అవకాశం ఉంటుంది.
