
D Educt: Aug 21: ఎంఫార్మసీ, ఫార్మా-డి, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీతో పాటు ఇతర అన్ని పీజీ కోర్సులకు సంబంధించి కనీస ఫీజులను ప్రభుత్వం పెంచింది. గతేడాది అమల్లో ఉన్న ఫీజులపై 17.5 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు కన్వీనర్ లేదా ప్రభుత్వ కోటా కింద ప్రవేశం పొందే విద్యార్థులకు వర్తిస్తుంది.
అయితే ప్రస్తుతం నిర్ణయించినవి మధ్యంతర ప్రాథమిక ఫీజులు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా ఫీజులను నిర్ణయించేందుకు తగినంత సమయం లేకపోవడంతో గతేడాది అమల్లో ఉన్న ఫీజులపై 17.5 శాతం పెంచి తాత్కాలికంగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
కొత్త ఫీజులపై తుది నిర్ణయం వెలువడిన తర్వాత ప్రస్తుత మధ్యంతర ఫీజులకు, కొత్తగా నిర్ణయించే ఫీజులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విద్యార్థులు సంబంధిత కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా కొత్త ఫీజులు ప్రస్తుత ఫీజుల కంటే తక్కువగా ఉంటే, నిబంధనల ప్రకారం తదుపరి సర్దుబాట్లు చేపట్టే అవకాశం ఉంటుంది.
ఈ నిర్ణయంతో ఎంఫార్మసీ, ఫార్మా-డి, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీతో పాటు ఇతర పీజీ కోర్సుల్లో ప్రభుత్వ లేదా కన్వీనర్ కోటా కింద చేరే విద్యార్థులపై తాత్కాలికంగా అదనపు ఫీజు భారం పడనుంది. కొత్త ఫీజుల నిర్ణయం అనంతరం తుది ఫీజు ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత రానుంది.
