
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెం.77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల నిర్ణయానికి సంబంధించిన ఈ ఉత్తర్వులను మరోసారి సమగ్రంగా పరిశీలించాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఛాంబర్ లేఖ రాసింది. ఈ మేరకు అధికారిక ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేసింది.
జీవో అమలుతో పరిశ్రమపై పడే ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని, తుది నిర్ణయం తీసుకునే ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అన్ని ప్రధాన వర్గాలతో విస్తృతంగా చర్చలు జరపాలని ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్ కోరారు. ప్రభుత్వం గుర్తించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
కొత్త జీవోలో ప్రవేశపెట్టిన ‘స్పెషల్ థియేటర్’ కేటగిరీ, దానికి సంబంధించిన నిబంధనలు, మారిన టికెట్ ధరల విధానం వల్ల క్షేత్రస్థాయిలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఫిల్మ్ ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రత్యేకంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే పలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. వారి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం చేసి, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడను కాపాడేందుకు ప్రభుత్వం సంబంధిత వర్గాలతో తక్షణ సమావేశం ఏర్పాటు చేయాలని ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణ, ఇతర నిబంధనలు పరిశ్రమలోని అన్ని వర్గాలకు సమతుల్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
ప్రభుత్వం, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సహా అన్ని భాగస్వాముల మధ్య చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొంటే పరిశ్రమకు ఎలాంటి నష్టం కలగకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది.
