
D Educt: Aug 19: ఆంధ్రప్రదేశ్‌లో బధిర విద్యార్థుల కోసం తొలి డిగ్రీ కళాశాల బాపట్ల జిల్లాలో ప్రారంభమైంది. వెదుళ్లపల్లిలో బధిరులకు ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం గత నెల 22న ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణలోని తాత్కాలిక భవనాల్లో డిగ్రీ కళాశాలను ప్రారంభించారు.
తొలి ఏడాది బీకాం కంప్యూటర్స్ కోర్సులో 30 సీట్లతో ప్రవేశాలు ప్రారంభిస్తున్నారు. కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అధ్యాపకుల నియామకంతో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
బీకాం కంప్యూటర్స్‌లో చేరే బధిర విద్యార్థులకు ప్రభుత్వం పలు ఉచిత సదుపాయాలను కల్పించనుంది. ఉచిత వసతి, భోజనంతో పాటు పాఠ్య, రాత పుస్తకాలు, కాస్మెటిక్స్ ఖర్చుల కోసం నగదు, వినికిడి పరికరాలను అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రజియా తెలిపారు.
ఆగస్టు 18న మాట్లాడిన ప్రిన్సిపల్.. అర్హత కలిగిన బధిర విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో కళాశాలకు వచ్చి ప్రవేశాలు పొందాలని సూచించారు. ప్రవేశాలు, ఇతర వివరాల కోసం 90000 13633 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని బధిర విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కళాశాల అధికారులు కోరారు.
