
D Spiritual: Aug 20: తిరుమల బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అధికమాసం కారణంగా టీటీడీ రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల తొలి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో డాక్టర్ ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి విభాగాధిపతులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల ముఖ్య ఘట్టాలు
సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. సెప్టెంబర్ 15న ధ్వజారోహణం, సెప్టెంబర్ 19న గరుడ వాహనం, సెప్టెంబర్ 22న రథోత్సవం, సెప్టెంబర్ 23న చక్రస్నానం నిర్వహించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు, దాతల ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు తెలిపింది.
గరుడసేవ సందర్భంగా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 20 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
భక్తుల కోసం క్యూలైన్లు, మాడ వీధుల గ్యాలరీల్లో విస్తృతంగా అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల్లోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు. విద్యుత్ అలంకరణలు, ఫల-పుష్ప ప్రదర్శనలు, లడ్డూల తగినంత నిల్వలను సిద్ధం చేస్తున్నారు.
పుష్కరిణి పనులు ముమ్మరం
బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 1 నుంచి జరుగుతున్న శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులను టీటీడీ వేగవంతం చేసింది. భక్తుల భద్రత కోసం పుష్కరిణిలో గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు నీటి లోతును తెలిపే సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి ప్రాజెక్టులు
బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ, బయోగ్యాస్ ప్లాంట్, 25 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.
ఆధునిక హంగులతో ఎస్వీ మ్యూజియం
కొన్నేళ్లుగా మూతపడి ఉన్న ఎస్వీ మ్యూజియాన్ని టీటీడీ అత్యాధునిక హంగులతో పునరుద్ధరించింది. టీసీఎస్ రూ.125 కోట్లు, మ్యాప్ సంస్థ రూ.20 కోట్లు అందించిన మొత్తం రూ.145 కోట్ల విరాళాలతో జీ+3 అంతస్తుల్లో 19 గ్యాలరీలను ఆధునీకరించారు. ఇందులో 3డీ, 7డీ సాంకేతికతను వినియోగించారు.
ఆలయ శిల్పకళ, విగ్రహాలు, అన్నమయ్య రాగిరేకులు, పురాతన నాణేలు, వేదాలు, పురాణ ఘట్టాలు, భక్తాగ్రేసరుల చరిత్రలను మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. భవనం పైభాగంలో 17 గోపురాలను కూడా నిర్మించారు.
బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు
తిరుమలలో రోజువారీగా ఉత్పత్తి అయ్యే చెత్తతో పాటు పేరుకుపోయిన దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్త సమస్యను పరిష్కరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) సహకారంతో రూ.12 కోట్ల వ్యయంతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలోని డంపింగ్ యార్డులో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు 1,000 కిలోల బయోగ్యాస్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్లాంట్ను నిర్మించారు. బ్రహ్మోత్సవాల సమయంలోనే సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభించనున్నారు.
25 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి
తిరుమలలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాతల సహకారాన్ని కోరుతోంది. రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేస్తోంది.
