
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ చేపడుతున్న ప్రతీకార చర్యల ప్రభావం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపై కూడా తీవ్రంగా పడుతోంది.
తాజాగా యూఏఈపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం అందడంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం అలర్ట్ సందేశాలను పంపింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్‌తో ఉన్న అన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్‌తో అన్ని రకాల వ్యాపార, ఆర్థిక సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మంగళవారం ప్రకటించింది. ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇరాన్‌తో వాణిజ్య, వ్యాపార, ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు యూఏఈ విదేశాంగ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమేలీ వెల్లడించారు.
ఇరాన్ నుంచి క్షిపణి ముప్పు ఉందంటూ యూఏఈ ప్రజల మొబైల్ ఫోన్లకు అత్యవసర హెచ్చరికలు పంపిన దాదాపు రెండు గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అంతేకాకుండా, ఇరాన్ నుంచి ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి తమ ప్రాదేశిక జలాల్లో పడినట్లు యూఏఈ ఆరోపించింది.
రెండు నెలల తర్వాత మళ్లీ క్షిపణి అలర్ట్
‘‘ప్రస్తుత పరిస్థితులు, క్షిపణి దాడి ముప్పు దృష్ట్యా.. వెంటనే సమీపంలోని సురక్షిత భవనంలో ఆశ్రయం పొందండి’’ అంటూ యూఏఈ హోం శాఖ ప్రజలను ఫోన్ అలర్ట్ ద్వారా అప్రమత్తం చేసింది. అయితే, కొద్దిసేపటికే ఈ హెచ్చరికను వెనక్కి తీసుకుంది.
జూన్‌లో వచ్చిన తప్పుడు అలర్ట్, జూలైలో జారీ చేసిన సరిహద్దు దాడి హెచ్చరికల తర్వాత యూఏఈలో ఇలాంటి క్షిపణి హెచ్చరిక వెలువడటం ఇదే తొలిసారి. అంతకుముందు మే ప్రారంభంలో చివరిసారిగా యూఏఈ ప్రజలకు క్షిపణి ముప్పుపై అలర్ట్ జారీ అయింది.
గత కొన్ని వారాలుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థ అడ్నాక్‌కు చెందిన ట్యాంకర్లపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దాడుల ప్రభావాన్ని యూఏఈ తీవ్రంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈని లక్ష్యంగా చేసుకున్నాయి.
ముగిసిన అవగాహన ఒప్పందం
ఇరాన్, యూఏఈ మధ్య జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది. ఒప్పందం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఈ రెండు నెలల వ్యవధిలో తమ భూభాగంపై పెద్దగా దాడులు జరగలేదని యూఏఈ వెల్లడించింది.
అయితే, ఒప్పందం ముగిసిన మరుసటి రోజే యూఏఈ మరోసారి అప్రమత్తమైంది. తమ భూభాగానికి క్షిపణి ముప్పు పొంచి ఉందంటూ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణి ముప్పును గుర్తించినట్లు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది.
