
D Spiritual: Aug 19: కాచిగూడ నుంచి షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్‌ను కవర్ చేసే 4 రోజుల ‘సాయి శివం’ (SHR008) టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, స్థానిక రవాణా, రెండు రోజుల బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
ఈ ప్యాకేజీలో స్లీపర్, 3AC తరగతులు అందుబాటులో ఉన్నాయి. జూలై 2026 నుంచి అమల్లో ఉన్న ధరల ప్రకారం 3AC కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ రూ.11,560, డబుల్ రూ.9,430, ట్రిపుల్ రూ.9,240గా ఉంది. స్లీపర్ స్టాండర్డ్ కేటగిరీలో సింగిల్ రూ.9,870, డబుల్ రూ.7,740, ట్రిపుల్ రూ.7,550గా ధరలు ఉన్నాయి.
మొదటి రోజు కాచిగూడ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభమవుతుంది. రెండో రోజు ఉదయం నాగర్‌సోల్ చేరుకుని షిర్డీకి వెళ్తారు. హోటల్ చెక్-ఇన్ అనంతరం సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవచ్చు. అయితే దర్శన టికెట్లు ప్యాకేజీలో ఉండవు.
మూడో రోజు షిర్డీ నుంచి నాసిక్, త్రయంబకేశ్వర్‌కు వెళ్లి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనంతరం నాగర్‌సోల్ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు ఉదయం 9:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీలో రైలు ప్రయాణం, షేరింగ్ ప్రాతిపదికన ఏసీ వాహనం, రెండు రోజుల బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్యాకేజీలో పేర్కొన్న సందర్శనా స్థలాల సందర్శన ఉంటాయి. లంచ్, డిన్నర్, ఆలయ దర్శన టికెట్లు, ప్రవేశ రుసుములు, టూర్ గైడ్, వ్యక్తిగత ఖర్చులు ఇందులో ఉండవు.
షిర్డీలో సప్పహీరో రిసార్ట్స్ లేదా సమానమైన హోటల్‌లో వసతి కల్పిస్తారు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం ప్రయాణానికి స్టాండర్డ్ క్లాస్‌లో 16 సీట్లు, కంఫర్ట్ క్లాస్‌లో 6 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. సీట్లు, ధరలు మారే అవకాశం ఉన్నందున బుకింగ్‌కు ముందు తాజా వివరాలను ఐఆర్‌సీటీసీ వద్ద నిర్ధారించుకోవడం మంచిది.
