
D Educt: Aug 19: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల తరహాలోనే 2026 సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ‘ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు’ కేటగిరీని ప్రారంభించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలో లైబ్రేరియన్ల సేవలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని, వారి కృషిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు లైబ్రేరియన్ల సంఘం తరఫున డాక్టర్ ఎం. శ్రీనివాస ప్రసాద్ ప్రభుత్వానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించారు.
యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు, పదోన్నతులు, పరిశోధన తదితర అంశాల్లో లైబ్రేరియన్లకు బోధనా సిబ్బందితో సమానమైన అకడమిక్ హోదా ఉందని వారు తెలిపారు. ఆధునిక డిజిటల్ యుగంలో గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను అందించే కేంద్రాలుగా కాకుండా డిజిటల్ విజ్ఞాన కేంద్రాలుగా రూపాంతరం చెందాయని వివరించారు.
జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలులో, అలాగే కళాశాలలకు న్యాక్ (NAAC) గుర్తింపు సాధించడంలో లైబ్రేరియన్లు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఈ-రిసోర్సులు, డిజిటల్ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపునకు తమవంతు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 2017 నుంచే ‘ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు’ అందిస్తున్న విషయాన్ని లైబ్రేరియన్లు ప్రస్తావించారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక అవార్డును ప్రవేశపెట్టడం సాధ్యమేనని తెలిపారు. లైబ్రేరియన్ల పనితీరును నిష్పక్షపాతంగా అంచనా వేసేందుకు తగిన మూల్యాంకన ప్రమాణాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై పరిశీలన జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కమిటీని నియమించిన విషయాన్ని కూడా వారు గుర్తుచేశారు.
లైబ్రేరియన్లకు ప్రత్యేక పురస్కారాలు అందించడం వల్ల వారిలో మరింత ఉత్సాహం, బాధ్యత పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. తద్వారా గ్రంథాలయ సేవలు మరింత మెరుగుపడి, రాష్ట్రంలోని ఉన్నత విద్యా ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో తమ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, 2026 సంవత్సరం నుంచి ‘ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు’ను అధికారికంగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్లు కోరారు.
