అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత మూడేళ్లుగా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ సైనికాధికారులను ఉటంకిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించి ఉండొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అనంతరం ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఉత్కంఠకు కొంతమేర తెరపడినట్లయింది.

జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకు భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం‌ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

ఇమ్రాన్ ఖాన్ తాజా వైద్య నివేదికలను ఆధారంగా చేసుకుని, ఆయనను ఆసుపత్రికి తరలించాలంటూ PTI నేతలు, కుటుంబ సభ్యులు కొంతకాలంగా చేస్తున్న డిమాండ్‌కు స్పందిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

PTI అధికార ప్రతినిధి నయీమ్ హైదర్ పంజుతా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్‌ను 48 గంటల్లోగా షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, సెప్టెంబర్ 16 వరకు ఆయనను ఆసుపత్రిలోనే ఉంచి వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. అనంతరం పలు కేసుల్లో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంపై ఆయన కుమారులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు దాదాపు కోల్పోయినట్లు ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన PTI మరో అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ.. ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ఆదేశాలు ఇంతకుముందే వెలువడి ఉంటే ఇమ్రాన్ ఖాన్ కంటి చూపుతో పాటు ఆయన సాధారణ ఆరోగ్యం ఇంతగా దెబ్బతినేది కాదని అన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేసే వరకు ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.