D News: Aug 18: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలిపోవడంతో పదో తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సాలూరులోని పెదహరిజనపేటకు చెందిన తుపాకుల అరుణ్ తేజ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తోటి విద్యార్థి యాకూబ్‌తో కలిసి పాఠశాల ప్రహరీ గోడపై కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా గోడ కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో అరుణ్ తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. యాకూబ్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తమ కుమారుడు మృతి చెందిన విషయం గురించి తమకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని అరుణ్ తేజ తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి మృతిపై బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన అనంతరం అక్కడి నుంచి పాఠశాలకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు.

మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికులు పాఠశాల వద్ద బైఠాయించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మంత్రి నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి

మరోవైపు సాలూరులో విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడటంపై మంత్రి నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి సంధ్యారాణిని అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి చెందడం అత్యంత బాధాకరమని నారా లోకేష్‌ అన్నారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.