జూనియర్ ఎన్టీఆర్ కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కుడి భుజానికి గాయం కావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సర్జరీ అనంతరం వైద్యులతో కలిసి ఎన్టీఆర్ దిగిన ఫొటో తాజాగా బయటకు వచ్చింది. దీంతో అభిమానులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

జిమ్‌లో గాయపడిన ఎన్టీఆర్

జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కుడి భుజానికి గాయమైనట్లు సమాచారం. వైద్యులను సంప్రదించగా శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో మంగళవారం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌కు కొంతకాలం ఫిజియోథెరపీ అవసరమని వైద్యులు సూచించారు. పూర్తిగా కోలుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే తదుపరి సినిమా షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది.