
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు రాష్ట్రాలు ‘ఇండియా డే’ వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ‘ఇండియా డే’గా ప్రకటిస్తూ ఇటీవల పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి. తాజాగా డెలావేర్ రాష్ట్రం కూడా ఆగస్టు 15ను ‘ఇండియా డే’గా ప్రకటించింది.
డెలావేర్‌లో భారతీయ సంతతి ప్రజల భాగస్వామ్యం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని గవర్నర్ మ్యాథ్యూ మేయర్ పేర్కొన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను అనుసరించే ప్రజలు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేశారని అన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు తమ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు సేవా దృక్పథంతో రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా దోహదపడ్డారని ప్రశంసించారు.
భారత సంస్కృతి, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ సంతతి ప్రజల పాత్రను గుర్తిస్తూ ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ‘ఇండియా డే’ను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే న్యూజెర్సీ గవర్నర్ కూడా ఆగస్టు 15ను ‘ఇండియా ఇండిపెండెన్స్ డే’గా ప్రకటించారు. అంతకుముందు న్యూయార్క్, మాసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆగస్టు 15న ‘ఇండియా డే’ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించాయి.
మరోవైపు అమెరికా వ్యాప్తంగా భారతీయ సంతతి ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఏడాది వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని భారత కాన్సులేట్లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ పతాకావిష్కరణలు, ఇతర వేడుకలు జరుగుతాయి. వీటిలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పాటు అమెరికా రాజకీయ ప్రజా ప్రముఖులు కూడా హాజరవుతారు.
ఆగస్టు 15 సందర్భంగా న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సహా పలు ప్రముఖ కట్టడాలు భారత త్రివర్ణ పతాకంలోని రంగులతో వెలుగులు విరజిమ్మనున్నాయి. దీంతో అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ఘనంగా జరగనున్నాయి.
