
D Educt: Aug 12: హోంశాఖలో 7,437 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థుల సన్నద్ధతకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద మహిళా అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు అభయ ఫౌండేషన్ నిర్వాహకులు ముందుకొచ్చారు. రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో, రీగల్ రెక్స్‌నార్డ్ ఆర్థిక సహాయంతో, వీఎంఆర్ లాజిక్స్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నంలోని అభయ ఆనంద నిలయంలో 100 రోజుల పాటు ఉచిత భోజనం, వసతితో కూడిన గురుకుల శిక్షణ ఇవ్వనున్నారు.
రోజుకు 8 గంటల పాటు తరగతులు నిర్వహించడంతో పాటు ప్రాథమిక రాతపరీక్ష నుంచి మెయిన్స్ వరకు పూర్తి స్థాయి శిక్షణ అందించనున్నారు. అనుభవజ్ఞుడైన ఇన్‌స్పెక్టర్ పి. జగదీశ్వర్ స్వీయ పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగనుంది. పోలీస్ ఉద్యోగాలకు అవసరమైన పరీక్షలపై అభ్యర్థులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అభ్యర్థినుల ఎంపిక కోసం ఆగస్టు 16న ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్‌తో పాటు మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ముల్కనూర్, ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సిద్దిపేట్, సంగారెడ్డిల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రవేశపరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 13లోపు ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు సైతం నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లి ప్రవేశపరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు.
పూర్తి వివరాల కోసం 9963002727, 9959220450, 7032813578 నంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. నిరుపేద మహిళా అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
