పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో స్వాతంత్య్ర డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. వేర్పాటువాద సంస్థ బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) తమను ఇకపై పాకిస్థాన్‌లోని ఓ రాష్ట్రంగా పరిగణించవద్దని, స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.

ఆగస్టు 11ను తమ స్వాతంత్య్ర దినోత్సవంగా ప్రకటించుకున్న BLA.. ఈ సందర్భంగా భారత్‌తో పాటు అంతర్జాతీయ మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. తమ స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రపంచ దేశాల నుంచి నైతిక మద్దతు అందించాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్‌ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ.. ఆ దేశాన్ని ‘కేన్సర్‌’తో పోల్చింది.

ఆగస్టు 11ను బలూచిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవంగా మద్దతుదారులు జరుపుకుంటున్న నేపథ్యంలో.. బలోచ్‌ వేర్పాటువాద నేత మిర్‌ యార్‌ బలోచ్‌ అంతర్జాతీయ సమాజానికి కీలక విజ్ఞప్తి చేశారు. బలూచిస్థాన్‌ను ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ బలూచిస్థాన్‌’గా గుర్తించి, స్వతంత్ర దేశంగా పరిగణించాలని ఆయన కోరారు.

ఈ మేరకు మిర్‌ యార్‌ బలోచ్‌ సోమవారం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. బలూచిస్థాన్‌ స్వతంత్ర దేశమని పేర్కొంటూ.. ఇకపై ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లోని ఓ ప్రావిన్స్‌గా పేర్కొనడం మానుకోవాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలను ఆయన కోరారు.

“మా భూమి అయిన బలూచిస్థాన్‌ నుంచి కేన్సర్‌లా మారిన పాకిస్థాన్‌ను తొలగించుకోవాలంటే.. బలోచ్‌ ప్రజలకు అంతర్జాతీయ సమాజం నుంచి నైతిక మద్దతు కొనసాగాలి” అని ఆయన పేర్కొన్నారు.

అయితే బలోచ్‌ వేర్పాటువాదుల ఈ వాదనలను పాకిస్థాన్‌తో పాటు అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు. అంతర్జాతీయంగా బలూచిస్థాన్‌ను ఇప్పటికీ పాకిస్థాన్‌లోని ఓ భాగంగానే పరిగణిస్తున్నారు. అయినప్పటికీ, గత నెలలో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) ఆ ప్రాంతంలోని పలు ప్రాంతాలపై తమ ఆధిపత్యం సాధించినట్లు ప్రకటించి, బలూచిస్థాన్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. ఆగస్టు 11ను స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహిస్తామని కూడా వెల్లడించింది.