
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమ ఆస్తుల పునరుద్ధరణతో పాటు ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధం కారణంగా జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ షరతులు నెరవేరితేనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని ఇరాన్ తెలిపింది.
ఇరాన్ డిమాండ్లపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దశాబ్దాలుగా ఇరాన్ సాగిస్తున్న చర్యలతో పాటు వేలాది మంది మరణాలకు ఆ దేశమే బాధ్యత వహించాలని, ముందుగా ఇరానే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరాన్–అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నంతకాలం అమెరికాతో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరిపేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలోనూ ఇరాన్ తన వైఖరిని కఠినతరం చేసింది. తాము విధించిన షరతులను అమెరికా పూర్తిగా అంగీకరించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇరాన్ నిర్ణయంతో అంతర్జాతీయ సముద్ర రవాణాతో పాటు ప్రపంచ మార్కెట్లపైనా ఆందోళనలు నెలకొన్నాయి.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ శనివారం మీడియాతో మాట్లాడుతూ తమ దేశ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికాతో చర్చలు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశానికి సంబంధించి ఇరాన్ కొన్ని కీలక డిమాండ్లను ముందస్తు షరతులుగా పెట్టినట్లు తెలిపారు.
అమెరికా తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అలాగే గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ఘర్షణల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టానికి అమెరికా భారీ పరిహారం చెల్లించాలని కోరింది. అంతేకాకుండా ఇరాన్‌పై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను తొలగించాలని, అమెరికా బ్యాంకులు, ఇతర ఆర్థిక వ్యవస్థల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను వెంటనే తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది.
