
D News: Aug 11: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కు గల్లంతవడంపై తీవ్రంగా స్పందించారు. బెంగళూరులో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియ అనంతరం తన ఓటు తొలగించబడిందని ఆయన వెల్లడించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన తన ఓటును ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సెటైరికల్ వీడియోను విడుదల చేశారు.
తన ఓటు తొలగింపుపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. “బెంగళూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియ తర్వాత ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని. ఇది పెద్ద జోక్ కదా?” అంటూ వ్యాఖ్యానించారు. తాను బెంగళూరులోనే పుట్టి, పెరిగి, చదువుకున్నానని, తన నాటకాలు, కళా ప్రస్థానం కూడా అక్కడే కొనసాగిందని తెలిపారు. గతంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, తన ఓటును తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు అడుగుతారో చూద్దామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ తన వీడియోలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “గేమ్ ఆన్” అంటూ తనదైన శైలిలో స్పందించిన ఆయన.. తమకు ఓటు వేయని పౌరుల ఓటు హక్కును తొలగించేందుకు అధికారాలను ఉపయోగించవచ్చని, అయితే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ప్రజల ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకోగలరా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యల ద్వారా ఓటు హక్కు, ప్రజాస్వామ్యంపై తన ఆందోళనను వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, జార్ఖండ్లో పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని కూడా ప్రకాశ్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. అణచివేత చర్యల ద్వారా ప్రజల నిరసనలను ఎప్పటికీ ఆపలేరని పేర్కొన్నారు.
