తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలకమైన ఎన్యుమరేషన్ ఫారమ్స్ సమర్పణ, డిజిటైజేషన్ గడువు నేటితో ముగిసింది. అయితే సర్వే ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న సమయంలో డిజిటైజేషన్‌లో నమోదైన మందగమనం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సగటున 78.14 శాతం డిజిటైజేషన్ పూర్తయింది. కొన్ని జిల్లాలు వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటైజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగలేదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వలసలు, చిరునామాల మార్పు, ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉండటం వంటి అంశాలు ఓట్ల తొలగింపునకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దీంతో అనుమానాస్పద ఓట్లను అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో రెండు లక్షలకు పైగా ఓట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఓట్లపై విస్తృత స్థాయిలో పరిశీలన కొనసాగుతోంది.

డిజిటైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు రాష్ట్ర సగటు 78.14 శాతం కంటే తక్కువగా నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాల్లోనే అత్యధిక సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మొత్తంగా SIR ప్రక్రియలో భాగంగా నమోదైన వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లో అనుమానాస్పద ఓట్లపై అధికారులు చేపడుతున్న పరిశీలన కీలకంగా మారింది.

By Rajini