
D-News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మోసాలను అడ్డుకోవడంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలు కీలకంగా మారనున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. మంగళవారం జరిగిన FIBAC 2026 సదస్సులో మాట్లాడుతూ.. వేగంగా మారుతున్న మోసాలను సంప్రదాయ నియమాల ఆధారిత వ్యవస్థలు ఎదుర్కోలేకపోతున్నాయని తెలిపారు.
“ఏఐతో జరుగుతున్న మోసాలను పరిమితం చేయగలిగేది ఏఐ మాత్రమే” అని మల్హోత్రా అన్నారు. ప్రస్తుతం మోసాలు API కాల్ వేగంతో జరుగుతున్నాయని, మోసగాళ్లు తమ వ్యూహాలను తరచూ మార్చుకుంటుండటంతో సంప్రదాయ ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలు ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటున్నాయని చెప్పారు. లావాదేవీల నమూనాలను నిరంతరం విశ్లేషించే AI, మెషిన్ లెర్నింగ్ మోడళ్లతోనే మోసం జరిగిన తర్వాత కాకుండా.. ముందుగానే అసాధారణ లావాదేవీలను గుర్తించవచ్చని వివరించారు.
బ్యాంకింగ్ రంగాన్ని మార్చనున్న ఏఐ
1990లలో ఆర్థిక సరళీకరణ, 2010లలో డిజిటలైజేషన్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయో.. ప్రస్తుత దశాబ్దంలో AI కూడా అంతే ప్రభావం చూపుతుందని మల్హోత్రా అన్నారు. బ్యాంకులు రిస్క్‌ను అంచనా వేయడం, కస్టమర్లకు సేవలు అందించడం, మూలధన ధర నిర్ణయించడం, సంస్థల నిర్వహణలో AI కారణంగా కీలక మార్పులు వస్తాయని తెలిపారు.
బ్యాంకింగ్ రంగం ఏఐ ప్రయాణాన్ని స్వీకరించాలా లేదా ఏఐనే తమ భవిష్యత్తును నిర్దేశించే పరిస్థితిని కల్పించాలా అన్నది ఇప్పుడు సంస్థలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఆర్బీఐ నియంత్రణలో కీలక ప్రాధాన్యతలు
RBI నియంత్రణ విధానంలో ఆర్థిక స్థిరత్వం, కస్టమర్ ప్రయోజనాలు, వ్యాపారం నిర్వహణ సౌలభ్యం, మధ్యవర్తిత్వ వ్యయాల తగ్గింపు ప్రధాన లక్ష్యాలని మల్హోత్రా తెలిపారు. గత ఏడాది కాలంలో ఈ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పారు.
బ్యాంకు బోర్డులపై నియంత్రణ భారాన్ని తగ్గించడంతో పాటు నిబంధనలను మరింత సూత్రాలు, విధానాల ఆధారంగా మార్చినట్లు వివరించారు. RBI ఇప్పటికే 203కి పైగా అప్లికేషన్ రకాల ప్రక్రియలను ఆటోమేట్ చేసి, నిర్దేశిత గడువులో 99.9 శాతం సేవలను అందిస్తోందని తెలిపారు. కరెంట్ అకౌంట్, వర్కింగ్ క్యాపిటల్ నిబంధనలను సరళీకరించడం, బల్క్ డిపాజిట్ల ధరల నిబంధనలను సమీక్షించడం, కొన్ని విదేశీ మారకద్రవ్య అనుమతులను అధీకృత డీలర్లకు అప్పగించడం వంటి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఏఐతో భారత్ డిజిటల్ మౌలిక వసతులకు మరింత బలం
AI బ్యాంకింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని మల్హోత్రా అన్నారు. ఆధార్, UPI, డిజిలాకర్ వంటి బలమైన ప్రజా డిజిటల్ మౌలిక వసతులు భారత్‌కు ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తున్నాయని తెలిపారు.
ఈ డిజిటల్ వేదికలపై ప్రైవేట్ రంగం కొత్త AI ఆధారిత సేవలను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. UPI ఆర్థిక లావాదేవీలను వేగవంతం చేసినట్లే.. AI ఆర్థిక నిర్ణయాలను కూడా వేగంగా, మరింత ఖచ్చితంగా, చివరి వ్యక్తి వరకు అందుబాటులోకి తీసుకురాగలదని పేర్కొన్నారు.
ఆర్థిక సేవల చేరువలో ఏఐతో వచ్చే సవాళ్లు
AI సరైన విధంగా వినియోగిస్తే ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయగలదని, అయితే నిర్లక్ష్యంగా అమలు చేస్తే కొత్త రకాల అసమానతలు, ఆర్థిక అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని మల్హోత్రా హెచ్చరించారు.
AI వినియోగంపై బాధ్యతాయుతమైన, నైతిక విధానాన్ని రూపొందించేందుకు RBI ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. సంప్రదాయ ఆర్థిక సమాచారం లేని వర్గాలను ప్రత్యామ్నాయ డేటా ఆధారంగా అంచనా వేసి రుణాలు అందించడంలో AI సహాయపడుతుందని చెప్పారు.
దీంతో బ్యాంకింగ్ సేవలు మరింత ప్రజాస్వామ్యీకరణ చెందడంతో పాటు.. ప్రస్తుతం బ్యాంకుల ఆదాయంలో 47-49 శాతం వరకు ఉన్న నిర్వహణ ఖర్చులను తగ్గించడంలోనూ AI కీలక పాత్ర పోషించగలదని మల్హోత్రా పేర్కొన్నారు.
