
కర్రెగుట్టలపై దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు.. డీజీపీ సీవీ ఆనంద్ 650 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకప్పుడు మావోయిస్టులకు ప్రధాన స్థావరంగా.. అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల్లో.. ‘ఆపరేషన్ కగార్’ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. డీజీపీ నేతృత్వంలోని అధికారులు తొలిసారి రోడ్డు మార్గంలో కర్రెగుట్టలకు చేరుకున్నారు. అటవీ సంపదకు నష్టం లేకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేసి, స్థానికులకు ఉపాధి కల్పిస్తామని డీజీపీ తెలిపారు.
ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి.దశాబ్దాలుగా సాధారణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు దాదాపు అందనంత ప్రాంతంగా ఉన్న ఈ కొండల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఐదు రోజుల ముందే తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కర్రెగుట్టలపై 650 అడుగుల ఎత్తులో కర్రెగుట్టల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఈ ప్రాంతంలో సుమారు 50 ఏళ్ల తర్వాత తెలంగాణ వైపుతొలిసారి జాతీయ జెండా ఎగరడం విశేషంగా నిలిచింది.
దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలు .. ఒకప్పుడు మావోయిస్టులకు ప్రధాన స్థావరంగా ఉండేది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న ఈ కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో ఈ కొండ ప్రాంతం ఎన్నో ఏళ్ల పాటు ఉద్రిక్తంగా ఉండేది. భద్రతా కారణాలతో ప్రభుత్వ అధికారులు సైతం ఈ ప్రాంతంలోకి వెళ్లడం కష్టంగా ఉండేది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తర్వాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పువచ్చింది. పలువురు మావోయిస్టులు భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా.. మరికొందరు లొంగిపోయారు. దీంతో కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు పట్టు సాధించాయి. ఈ పరిణామాలు అక్కడ అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేశాయి.
