
D News: Aug 10: హ్యాష్ ఆయిల్ దందాకు చెక్.. పాత నేరస్థుడి అరెస్ట్
రాజధాని హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా వ్యవహారం కలకలం రేపింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, పెడ్లర్లు కొత్త మార్గాల్లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ యువతను మత్తుకు బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పోలీసుల కళ్లుగప్పి హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఓ పాత నేరస్థుడిని ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి భారీ మొత్తంలో హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని అతడి డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేశారు.
స్నాప్‌చాట్ ద్వారా హ్యాష్ ఆయిల్ దందా
ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) డ్రైవర్‌గా పనిచేస్తూనే డ్రగ్స్ విక్రయాలకు అలవాటు పడ్డాడు. గతంలో ఎన్డీపీఎస్ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన అతడు.. మళ్లీ డ్రగ్స్ దందాను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 2న ఒడిశాకు వెళ్లిన శ్రీనివాస్ అక్కడ రూ.9,000కు హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
పోలీసుల నిఘాకు చిక్కకుండా సరఫరాదారుడితో స్నాప్‌చాట్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ముందస్తు టికెట్ లేకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణిస్తూ హైదరాబాద్‌కు హ్యాష్ ఆయిల్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. నగరంలో 10 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్‌ను రూ.1,200 చొప్పున విక్రయించి భారీగా లాభాలు ఆర్జించాలని శ్రీనివాస్ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో పోలీసుల నిఘా
విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ఆగస్టు 8న విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. బస్సు నుంచి దిగిన వెంటనే శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.2.5 లక్షల విలువైన 200 మిల్లీలీటర్ల (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్య సరఫరాదారు కోసం గాలింపు
నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్న హరి కోసం గాలింపు చేపట్టారు. డ్రగ్స్ విక్రయాలు, సరఫరాకు సంబంధించి మరింత సమాచారం సేకరిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, అలవాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులు హెచ్చరించారు.
