హైడ్రాలో డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం వచ్చిన నిరుద్యోగులను అవమానించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

విద్యార్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని హరీశ్ రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం. 32 నెలలు గడిచినా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.

హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలిరావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనందువల్లే నిరుద్యోగులు చిన్నచిన్న పోస్టుల కోసం కూడా భారీగా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి స్థాయిలో ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం బాధాకరమని హరీశ్ రావు పేర్కొన్నారు. ‘యథా రాజా తథా అధికారులు’ అన్న సామెత గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానించడం సరికాదన్నారు.

By Rajini