ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ములుగు జిల్లాలోని 10 మండలాలతో పాటు, ములుగు నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో తాగునీటి వసతుల కల్పనకు నిధులు విడుదల చేసింది.

మొత్తం 12 మండలాల్లోని 108 గిరిజన ఆవాసాలకు ప్రత్యామ్నాయ, అదనపు తాగునీటి వసతులు కల్పించేందుకు రూ.20.96 కోట్లను విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను మిషన్‌ భగీరథ పథకం కింద గిరిజన ఆవాసాల్లో తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు.

నిధుల కేటాయింపులో గోవిందరావుపేట మండలానికి అత్యధికంగా రూ.3.97 కోట్లు మంజూరయ్యాయి. ములుగు మండలానికి రూ.2.73 కోట్లు, వెంకటాపూర్‌ మండలానికి రూ.2.65 కోట్లు, మంగపేటకు రూ.2.26 కోట్లు కేటాయించారు. తాడ్వాయికి రూ.1.61 కోట్లు, ఏటూరునాగారానికి రూ.1.23 కోట్లు, మల్లంపల్లికి రూ.1.23 కోట్లు, కన్నాయిగూడెంకు రూ.1.11 కోట్లు విడుదల చేశారు.

అలాగే వాజేడు మండలానికి రూ.1.07 కోట్లు, వెంకటాపురం మండలానికి రూ.63 లక్షలు మంజూరు చేశారు. ఈ రెండు మండలాలు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన కొత్తగూడ మండలానికి రూ.1.84 కోట్లు, గంగారం మండలానికి రూ.66 లక్షలు కేటాయించారు.

By Rajini