హైడ్రాలో డ్రైవర్ పోస్టుల భర్తీ సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో అధికారం కోసం విద్యార్థులు, నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు అనేక హామీలు ఇచ్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల కోసం యువత రోడ్లపైకి వస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం ఏంటని నిలదీశారు. హైడ్రాలో కేవలం 150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని పేర్కొన్నారు. ఇది నిరుద్యోగుల తప్పిదమా? లేక ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు.

ఇంజినీరింగ్ చదివిన యువతను ముఖ్యమంత్రి స్థాయిలో “క్రిమినల్ వేస్ట్” అంటూ వ్యాఖ్యానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే “యథా రాజా.. తథా అధికారులు” అనే సామెత గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. 32 నెలలు గడిచినా ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు నిజంగానే భర్తీ చేసి ఉంటే.. ప్రస్తుతం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? అని నిలదీశారు.

ప్రస్తుత పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ మరింత పెరుగుతోందని హరీశ్ రావు అన్నారు. నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాకపోవడంతో పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు కూడా చిన్న స్థాయి ఉద్యోగాల కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ అని విమర్శించారు.

ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వర్తించడం లేదని, యువతకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

“ఉద్యోగం అడగడం తప్పు కాదు. ప్రశ్నించడం తప్పు కాదు. ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా తప్పు కాదు. ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలి. యువతపై అనుచితంగా మాట్లాడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వారిని అవమానించినందుకు విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి” అని హరీశ్ రావు తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.