
సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోలు, నిర్మాతలు చేసే వ్యాఖ్యలు కూడా మూవీ రిజల్ట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో తాను మాట్లాడే విధానాన్ని బట్టి ప్రేక్షకులు, సినీ అభిమానులు సినిమాపై కొన్ని అంచనాలు ఏర్పరచుకుంటారని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. తన ప్రమోషనల్ విధానం, మీడియాతో తన వ్యవహారశైలి, వివాదాస్పద ప్రశ్నలకు తాను స్పందించే తీరుపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ రెచ్చగొట్టాలని లేదా వివాదాలకు కారణం కావాలని ప్రయత్నించనని స్పష్టం చేశారు. అయితే మీడియా నుంచి కాంట్రవర్సీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు తనకు తెలిసిన విషయాలను బట్టి సమాధానం ఇస్తానని చెప్పారు. ఎవరైనా వ్యంగ్యంగా ప్రశ్నిస్తే.. అదే తరహాలో స్పందించడం తనకు అలవాటని పేర్కొన్నారు.
ఒక సినిమా తన ‘బ్రెయిన్ చైల్డ్’ లేదా ‘ప్రొడక్ట్’ అయినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం, సమర్థించడం, ప్రేక్షకులకు చేరువ చేయడం సహజమైన విషయమని నాగవంశీ అన్నారు. సినిమాకు స్పోక్స్‌పర్సన్‌గా ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో కాస్త ఎక్కువ కాన్ఫిడెంట్‌గా మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మీడియా ఇంటర్వ్యూల్లో తాను చెప్పే మాటలను బట్టి ప్రేక్షకులు సినిమా రిజల్ట్‌పై తమ అంచనాలను పెంచుకుంటారని పేర్కొన్నారు.
బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ ఏమన్నారు?
మరోవైపు బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రచారంపై కూడా నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తాను ఏ ఫ్లాప్ సినిమాను హిట్‌గా చెప్పలేదని, కావాలనే కలెక్షన్ నంబర్లను పెంచి ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు.
అయితే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా.. మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలో పోస్టర్లపై ప్రచురించే బాక్సాఫీస్ నంబర్లు వాస్తవ గణాంకాలకు భిన్నంగా ఉండే సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఒక సినిమా రూ.1 కోటి వసూలు చేసిందా, లేక రూ.90 కోట్లు సాధించిందా అనే విషయాన్ని ఎందుకు దాచాలని ఆయన ప్రశ్నించారు.
అభిమానుల కోసం, అలాగే సినిమా మార్కెటింగ్‌లో భాగంగా కలెక్షన్లను ప్రచారం చేస్తున్నారని నాగవంశీ తెలిపారు. అయితే బాక్సాఫీస్ నంబర్ల విషయంలో వాస్తవ గణాంకాలు ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
