D News: Aug 7: పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ: ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాలు వెల్లడించింది. ఫేజ్-1 కింద కేంద్ర నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ మట్టం వరకు మాత్రమే వర్తించినప్పటికీ, ప్రాజెక్టు సివిల్ పనులు పూర్తి స్థాయి జలాశయ మట్టం (FRL) అయిన 45.72 మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే తొలి దశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన గ్యాప్-1, గ్యాప్-2 పనులతో పాటు భూసేకరణ, పునరావాస (R&R) కార్యక్రమాలను కూడా 2027 జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

2023 ధరల ప్రకారం ఫేజ్-1కు కేంద్రం రూ.30,436.95 కోట్లను ఆమోదించింది. ఇందులో 2024-25లో రూ.5,512.40 కోట్లు, 2025-26లో రూ.2,810.22 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణ వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే నిధుల వినియోగానికి సంబంధించిన సాంకేతిక పత్రాలు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (UCs)ను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సమర్పిస్తోందని కేంద్ర మంత్రి ప్రశంసించారు.