
D News: Aug 7: పెద్ద శంకరంపేట: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కండేయ మందిరంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ మాట్లాడుతూ, చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి భరోసా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పద్మశాలి కార్పొరేషన్ ద్వారా చేనేతతో పాటు ఇతర వృత్తులు చేస్తున్న పద్మశాలీలకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు అందిస్తున్నట్లే తెలంగాణలోనూ ప్రతి చేనేత కార్మికుడికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల పద్మశాలి సంఘం నాయకులు, చేనేత సహకార సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.
