D News: Aug 7: RBI రుణ వసూలు: రుణ గ్రహీతల స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా లాక్ చేసే రికవరీ విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రుణగ్రహీతల వ్యక్తిగత స్వేచ్ఛ, డేటా గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం, రిమోట్ డివైజ్ లాకింగ్‌ను కేవలం ఆ డివైజ్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాలకే వర్తింపజేయాలి. ఈఎంఐ చెల్లింపులో ఒక రోజు ఆలస్యం అయిన వెంటనే డివైజ్‌ను లాక్ చేయరాదు. కనీసం 30 రోజుల బకాయి తర్వాత పరిమిత నియంత్రణలు, 60 రోజుల తర్వాత మాత్రమే పూర్తి లాకింగ్ అమలు చేయాలి.

డివైజ్ లాక్ చేసినప్పటికీ ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, SOS సేవలు, ఉపాధికి అవసరమైన అత్యవసర ఫీచర్లు అందుబాటులో ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే రికవరీ యాప్‌లు వినియోగదారుల కాంటాక్ట్‌లు, ఫోటోలు, వీడియోలు, కాల్ లాగ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, లొకేషన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడాన్ని నిషేధించింది.

రుణం మంజూరు చేసే సమయంలోనే ఈ నిబంధనలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని, డివైజ్‌ను లాక్ చేసే ముందు ముందస్తు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. బకాయి చెల్లించిన గంటలోపు డివైజ్‌ను అన్‌లాక్ చేయాలి. ఆలస్యం జరిగితే ప్రతి గంటకు రూ.250 చొప్పున పరిహారం చెల్లించాలని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది.