
D News: Aug 4: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం విశాఖపట్నం, అమరావతిలో పర్యటించనున్నారు. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ రంగానికి సంబంధించిన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం అమరావతికి చేరుకోనున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం విశాఖపట్నంలోని అరిలోవా ప్రాంతంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడనుందని అధికారులు పేర్కొంటున్నారు.
అనంతరం మధ్యాహ్నం ఇసుకతోట జంక్షన్‌లోని ‘లాన్సమ్ స్కేర్’ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన IBM FutureNow Centerను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అవకాశాలు మరింత విస్తరించనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
విశాఖపట్నం కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మంత్రి నారా లోకేష్ సాయంత్రం అమరావతికి చేరుకుని, అక్కడ నిర్వహించే అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
