
D News: Aug 4: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17 నుంచి విమానాశ్రయంలో పూర్తిస్థాయి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై ‘వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ అని ప్రదర్శించడంతో సోషల్ మీడియాలో పలు చర్చలు, సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ అంశంపై ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ విమానాశ్రయం పేరుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ నిబంధనల ప్రకారమే విమానాశ్రయం పేరుకు ముందు ‘వైజాగ్’ అనే పదాన్ని ఉపయోగించారని, అంతమాత్రాన భోగాపురం విమానాశ్రయం విజయనగరం జిల్లా పరిధిలో ఉండదనే అర్థం కాదని స్పష్టం చేశారు.
దీనికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధారణంగా హైదరాబాద్ లేదా శంషాబాద్ విమానాశ్రయం అని పిలుస్తారని, అయినప్పటికీ దాని భౌగోళిక పరిధి మారదని మంత్రి వివరించారు. అదే విధంగా భోగాపురం విమానాశ్రయం కూడా ఎప్పటికీ విజయనగరం జిల్లా రెవెన్యూ పరిధిలోనే కొనసాగుతుందని తెలిపారు.
విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీపై కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. బ్లూ కాలర్ ఉద్యోగాల్లో 70 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించినట్లు వెల్లడించారు. వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాలు మాత్రం అభ్యర్థుల అర్హత, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా చేపడతామని చెప్పారు.
ఉద్యోగాల విషయంలో స్థానికులకు మరింత ప్రాధాన్యం కల్పించే అంశంపై జీఎంఆర్ యాజమాన్యంతో మరోసారి చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం విమానాశ్రయ కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
