
D Entr: Jul 28: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనట్లు ఆయన నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా మణికట్టుకు గాయపడటంతో వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ శస్త్రచికిత్సకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనతో పాటు అమెరికాలోని మయామి నుంచి ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు.
డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌లతో కూడిన వైద్యుల బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఆపరేషన్ అనంతరం రామ్ చరణ్‌కు కనీసం ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతితో పాటు ఫిజియోథెరపీ అవసరమని వైద్యులు సూచించారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం రామ్ చరణ్ హైదరాబాద్‌కు చేరుకుని కొన్ని వారాల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. శస్త్రచికిత్స అనంతరం వైద్యులతో కలిసి దిగిన ఆయన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ‘పెద్ది’ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది. షూటింగ్ సమయంలో గాయపడినప్పటికీ రామ్ చరణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కీలక సన్నివేశాలను పూర్తి చేశారని, సినిమా పట్ల ఆయన చూపిన అంకితభావం, పట్టుదల మొత్తం చిత్ర బృందానికి స్ఫూర్తినిచ్చాయని పేర్కొంది.
రామ్ చరణ్ త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ చిత్రీకరణలో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
