
D News: Jul 27: తెలంగాణ జాగృతికి కొత్త అధ్యక్షురాలు.. ఫౌండర్ ఛైర్పర్సన్గా కవిత
తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. గత రెండు దశాబ్దాలుగా సంస్థను ముందుండి నడిపించిన కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ ఛైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. అదే సమయంలో తెలంగాణ జాగృతి నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని నియమిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. కొత్త నాయకత్వంలో తెలంగాణ జాగృతి మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆకాంక్షించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న సమయంలో ప్రాంతీయ సంస్కృతి, చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో 2006లో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సాంస్కృతిక పరిరక్షణ ద్వారా సంస్థ విశేషంగా తోడ్పడింది. తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, పునరుజ్జీవనమే సంస్థ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.
తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలను పెద్దఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడంలోనూ సంస్థ విశేష కృషి చేసింది.
కొత్త అధ్యక్షురాలు మారిపల్లి మాధవి నాయకత్వంలో తెలంగాణ జాగృతి మరింత బలోపేతమై, అదే స్ఫూర్తితో సాంస్కృతిక, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్తుందని కల్వకుంట్ల కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
