
D News: Jul 27: అబిడ్స్‌లో డ్రగ్స్ నిందితుడి బీభత్సం.. పోలీసులపై కారు దూకించి పరారీ యత్నం
హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రేత బీభత్సం సృష్టించాడు. డ్రగ్స్ డీల్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) పోలీసులపైకే కారు దూకించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు విరగగా, సీఐతో పాటు మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.
అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ సమీపంలో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో హెచ్-న్యూ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి వచ్చి కారులో ఉన్న హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌కు డ్రగ్స్ ప్యాకెట్ అందజేశాడు. వెంటనే ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సైఫ్‌ను కారు దిగాలని ఆదేశించారు.
అయితే, కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా వాహనాన్ని రివర్స్‌లో వేగంగా నడిపి అడ్డుగా ఉన్న కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి పోనిచ్చాడు. అనంతరం అక్కడి నుంచి వేగంగా పరారయ్యేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ నిందితుడి కారును వెంబడించి సినిమా తరహాలో ఛేజ్ నిర్వహించారు. చివరకు అఫ్జల్‌గంజ్ వద్ద కారును అడ్డుకుని సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో కాలి ఎముక విరిగిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌ను చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. చేజింగ్ సమయంలో గాయపడిన ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ కూడా చికిత్స పొందుతున్నారు.
గాయపడిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లలో హత్యాయత్నం (Attempt to Murder) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
