
D News: Jul 25: తిరువణ్ణామలై ఆలయంలో విషాదం.. గుహలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
తమిళనాడులోని ప్రసిద్ధ తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు మణికుమార్ (36) ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన ఆలయానికి వచ్చిన భక్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
శుక్రవారం రాత్రి మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి వెళ్లాడు. తెలుగువారు ఈ గుహ మార్గాన్ని “మోక్ష మార్గం”గా భావిస్తారు.
గుహ ఆకారంలో ఉండే ఈ ఆలయంలో భక్తులు వెనుకవైపు ప్రవేశద్వారం నుంచి పడుకుని లోపలికి ప్రవేశించి, అత్యంత ఇరుకైన మార్గంలో పాకుతూ ఎదురువైపు ద్వారం గుండా బయటకు వస్తారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు, అక్కడున్న ఇతర భక్తులు ఆయనను బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కొంతసేపటికే మణికుమార్‌కు ఊపిరాడక అపస్మారక స్థితి ఏర్పడింది. అనంతరం ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి ఆయనను గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం ప్రత్యేకత
గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం చిన్న గుహ ఆకారంలో నిర్మించబడింది. భక్తులు వెనుకవైపు ఉన్న ప్రవేశ మార్గం ద్వారా లోపలికి వెళ్లి, ఇరుకైన గుహలో పాకుతూ ముందువైపు ద్వారం గుండా బయటకు వస్తారు. అనంతరం నంది, ఇడుక్కు పిల్లయ్యార్ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఆచారాన్ని నిర్వహించే క్రమంలోనే మణికుమార్ గుహలో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదానికి దారితీసింది.
