
D News: Jul 17: హైదరాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో, ఈ మార్గాన్ని శ్రీశైలం మీదుగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. ఈ ప్రతిపాదన అమలైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు సుమారు గంట వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఏర్పడనుంది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు, చెన్నైలకు రెండు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు సర్వే, అలైన్మెంట్, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్–బెంగళూరు కారిడార్ అలైన్మెంట్లో కీలక మార్పులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కొత్త అలైన్మెంట్ ప్రకారం బుల్లెట్ రైలు శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం మీదుగా బెంగళూరుకు వెళ్లేలా మార్గాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రతి ఏడాది వేలాదిమంది భక్తులు శ్రీశైలానికి వెళ్లే నేపథ్యంలో ఈ మార్గం వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
శ్రీశైలం మీదుగా బుల్లెట్ రైలు నడిస్తే భక్తుల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అలైన్మెంట్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
ఇదే సమయంలో హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కారిడార్‌కు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం పలు మార్పులను సూచించింది. మొత్తం 744 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌లో 236 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉండనున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఐదు బుల్లెట్ రైలు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రణాళిక రూపొందుతోంది.
మొదట ఈ కారిడార్‌ను శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి, దాచేపల్లి మీదుగా తీసుకెళ్లేలా ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం దానిలో మార్పులు సూచించింది. బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా అమరావతికి చేరుకునేలా కొత్త అలైన్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మార్పులు అమలైతే రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ లభించే అవకాశం ఉంది.
