
DNews: July11: దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ‘E20’ ఇంధనంపై వస్తున్న విమర్శలు, సందేహాలపై కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇ20 ఇంధనం వల్ల కొన్ని వాహనాల మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం అధికారికంగా అంగీకరించింది. అయితే, మైలేజీలో వచ్చే స్వల్ప తగ్గుదల కంటే ఈ ఇంధనం వల్ల లభించే దీర్ఘకాలిక ప్రయోజనాలే చాలా ఎక్కువని పేర్కొంటూ ఒక సమగ్ర ‘ప్రశ్నలు-జవాబుల’ (FAQ) పత్రాన్ని విడుదల చేసింది.
ఇ20 ఇంధనం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
ఇ20 అనేది సాధారణ పెట్రోల్ మాత్రమే కాదని, పాత ఇ10 లేదా స్వచ్ఛమైన పెట్రోల్ కంటే ఎంతో నాణ్యమైన, సమర్థవంతమైన ఇంధనమని కేంద్రం పేర్కొంది. దీనివల్ల కలిగే లాభాలు ఇవే:
- మెరుగైన పికప్ & యాక్సిలరేషన్: ఇ20 ఇంధనంలో ‘ఆక్టేన్ రేటింగ్’ (Octane Rating) ఎక్కువగా ఉండటం వల్ల వాహనం పికప్ అద్భుతంగా ఉంటుంది. యాక్సిలరేషన్ ఎంతో సరళంగా మారుతుంది.
- ఇంజిన్ రక్షణ: ఇంజిన్ లోపల సుపీరియర్ యాంటీ-నాకింగ్ ఫీచర్ ఉండటం వల్ల వేగవంతమైన కంబషన్ (ఇంధన దహనం) జరుగుతుంది.
- పర్యావరణానికి మేలు: ఈ స్వచ్ఛమైన ఇంధనం వల్ల పర్యావరణానికి హాని చేసే కర్బన ఉద్గారాల విడుదల భారీగా తగ్గుతుంది.
పాత వాహనాల ఇంజిన్ పాడవుతుందా?
పాత తరం వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడటం వల్ల ఇంజిన్లు దెబ్బతింటాయనే ఆందోళనలను కేంద్ర మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. ఈ ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చే ముందే ఇంజిన్ మన్నిక, తుప్పు నిరోధకతపై క్షుణ్ణంగా శాస్త్రీయ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
ఆటోమొబైల్ సంస్థల ఫీడ్‌బ్యాక్: దేశీయ దిగ్గజాలైన మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ వంటి సంస్థల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ప్రకారం.. ఇ20 పెట్రోల్ వాడకం వల్ల ఇంజిన్లు తుప్పు పట్టడం, విడిభాగాలు అసాధారణంగా అరిగిపోవడం వంటి సమస్యలు ఎక్కడా నమోదు కాలేదు.
ప్రత్యేక పెట్రోల్ విక్రయాల డిమాండ్ తిరస్కరణ!
బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్, ఇ10, ఇ20 ఇంధనాలను విడివిడిగా (సమాంతరంగా) విక్రయించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం స్పష్టంగా తిరస్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా రిటైల్ అవుట్‌లెట్లలో ఇలా వేర్వేరు సరఫరా వ్యవస్థలను నిర్వహించడం వల్ల లాజిస్టిక్స్ మరియు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి, పంపిణీ వ్యవస్థ మరింత క్లిష్టంగా మారుతుందని కేంద్రం వివరించింది.
ఇ20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గలేదు?
పెట్రోల్ కంటే ఇథనాల్ మిశ్రమ ఇంధనం చౌకగా ఉండాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
- రైతులకు లాభదాయక ధర: దేశీయంగా అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఇథనాల్ ధరలను లాభదాయకమైన రేట్లలో నిర్ణయిస్తోంది.
- తయారీ వ్యయం: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు తక్కువగా ఉన్న సమయంలో, సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ తయారీకే ఎక్కువ ఖర్చు అవుతుందని కేంద్రం వెల్లడించింది.
